UGC NET Exam: యూజీసీ నెట్.. మీ కెరీర్ కోసం సరైన మార్గం 11 month ago

featured-image

యూజీసీ నెట్ స్కోర్‌తో ప్ర‌యోజ‌నాలు:

యూజీసీ ఆధ్వ‌ర్యంలో ఎన్‌టీఏ ప్ర‌తి సంవ‌త్స‌రం రెండుసార్లు ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు పోటీప‌డ‌టానికి, పీహెచ్‌డీలో చేర‌డానికి, ప్ర‌భుత్వ అనుబంధ సంస్ధ‌ల్లో ఉద్యోగాల‌కూ ఈ నెట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ప్ర‌తి నెలా స్టైఫండ్ కూడా తీసుకుంటూ ప‌రిశోధ‌న‌లు కోన‌సాగించ‌వచ్చు. 


ఈ ప‌రీక్ష‌ల‌కు కావ‌ల్సిన విద్యార్హ‌త సంబంధిత స‌బ్జెక్టులో 55 శాతం మార్కుల‌తో పీజీ ఉత్తీర్ణ‌త‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయ‌ర్‌, దివ్యాంగులు, ట్రాన్స్ జెండ‌ర్ల‌కు 50 శాతం మార్కులు స‌రిపోతాయి. ప్ర‌స్తుతం పీజీ చ‌దువుతున్నవారు, నాలుగు సంవ‌త్స‌రాల బ్యాచిల‌ర్ కోర్సులు చ‌దివిన‌వారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీరికి డిగ్రీలో 75 శాతం మార్కులు అవ‌స‌రం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు 70 శాతం స‌రిపోతుంది. యూజీతో జేఆర్ఎఫ్‌, పీహెచ్‌డీల్లో ప్ర‌వేశానికే అర్హులు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు పోటీ ప‌డ‌లేరు. చివ‌రి సంవ‌త్స‌రం కోర్సుల్లో ఉన్న‌వారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ అర్హ‌త పొంద‌డానికి, పీహెచ్‌డీ ప్ర‌వేశానికీ వ‌య‌సుతో సంబంధంలేదు. కానీ జేఆర్ఎఫ్‌కు డిసెంబ‌ర్ 1, 2024 నాటికి 30 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయ‌ర్‌, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ‌ర్లు, మ‌హిళ‌ల‌కు గ‌రిష్ట వ‌య‌సులో ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. 


యూజీసీ నెట్ ఎన్ని స‌బ్జెక్టుల్లో రాయ‌వచ్చు?

85 స‌బ్జెక్టుల్లో ఈ యూజీసీ నెట్ ప‌రీక్ష‌ను రాయ‌వ‌చ్చు. ఈ లిస్ట్‌లోకి కొత్త‌గా ఆయుర్వేద బ‌యాల‌జీ కూడా చేరింది. లాంగ్వేజ‌స్ కాకుండా, మిగిలిన‌ స‌బ్జెక్టుల ప్ర‌శ్నా ప‌త్రాలు ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ల‌ను అంద‌రికీ ఉమ్మ‌డిగానే నిర్వ‌హిస్తారు. కానీ అర్హ‌త సాధించ‌డానికి 3 కేట‌గిరీలు ఉన్నాయి. అవ‌స‌రాల ప్ర‌కారం వాటిలో ఏదైనా సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. 


కేట‌గిరీ-1: దీనిలో ఎంపికైన వారు ప్ర‌తినెలా యూజీసీ నిర్ధేసించిన స్టైఫండ్ (జేఆర్ఎఫ్‌) పొందుతూ ప‌రిశోధ‌న (పీహెచ్‌డీ) కొన‌సాగించుకోవ‌చ్చు. వీరు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు, జేఆర్ఎఫ్ లేకుండా జ‌రిపే పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కూ అర్హులే.


కేట‌గిరీ-2: ఇందులో అవ‌కాశం వ‌స్తే జేఆర్ఎఫ్ ద‌క్క‌దు, కానీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు, పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కు అర్హులే.


కేట‌గిరీ-3: వీరు పీహెచ్‌డీలో ప్ర‌వేశానికే మాత్ర‌మే అర్హులు. నెట్ స్కోరుకు 70, ఇంట‌ర్వ్యూకు 30 శాతం వెయిటేజీ దక్కుతుంది. ఇలా అవ‌కాశం వ‌చ్చిన‌వాళ్లు చేరిన సంస్ద నిబంధ‌న‌ల మేర‌కు ఎంతో కొంత స్టైఫండ్ పొందుతారు. ఈ స్కోరు ఏడాది వ‌ర‌కు చెల్లుతుంది.


యూజీసీ కటాఫ్ మార్కు?

సబ్జెక్టులను అనుస‌రించి ఈ క‌టాఫ్ మార్కు మారుతుంది. లెక్చరర్‌షిప్ అయితే ఏ సబ్జెక్టు అయినా కూడా అన్ రిజ‌ర్వ్డ్ క్యాట‌గిరీ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్ఎఫ్ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో లెక్చరర్ షిప్ 180 మార్కులకీ పొందవచ్చు. జేఆర్ఎఫ్ 200 మార్కుల‌కి లభిస్తోంది. పీహెచ్‌డీ కోసమే అయితే కొన్ని సబ్జెక్టుల్లో 90 మార్కులకీ, మరికొన్ని సబ్జెక్టుల్లో మాత్రం 180 వరకు రావాలి. సబ్జెక్టుల వివ‌రాలు, కేటగిరీ వారీగా కటాఫ్‌ వివరాలు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు.


యూజీసీ నెట్ స్కోరుతో..

ఈ నెట్ స్కోరుతో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ ఎఫ్) అవకాశం వచ్చినవారు నాణ్య‌మైన‌ సంస్థల్లో పరిశోధన (పీహెచ్)లో చేరవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా రూ.31,000 చెల్లిస్తారు. త‌ద‌నంత‌రం సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్‌) కి అర్హత సాధిస్తే రూ. 35,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. సంస్థ వసతి కల్పించకపోతే స్టైఫండ్‌లో 30 శాతం వరకు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది.


జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివ‌ర్సిటీలు ఎక్కువ‌ స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి. పోటీ ప్రవేశ పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్న సంస్థలు కూడా ఫ్యాకల్టీ సభ్యుల ఎంపికలో నెట్ స్కోరుకు ప్రాధాన్యత‌నిస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉంటే అధిక వేతనం కూడా అందుకోవ‌చ్చు.


జాతీయ స్థాయిలో ఎస్సీ, దివ్యాంగ, ఓబీసీ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికి నెట్ అర్హత తప్పనిసరి. కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఈ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ఈ స్కోరుతోనే రాష్ట్రీయ సంస్థల్లోనూ పీహెచ్‌డీలోనూ చేరవచ్చు.


ప్రిప‌రేష‌న్‌:

• అభ్య‌ర్ది సంబంధిత సబ్జెక్టులో యూజీసీ నెట్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నపుడు ఆ స‌బ్జెక్టులో ప్రావీణ్యంతో పాటు బోధ‌న‌, ప‌రిశోధ‌న‌లో నైపుణ్యాలు త‌ప్ప‌నిస‌రి.

• ప‌రీక్షార్దుల కోసం యూజీసీ వెబ్‌సైట్‌లో స‌బ్జెక్టుల వారీ సిల‌బ‌స్ వివ‌రాల‌ను పొందుప‌రిచారు. వాటిని క్షుణ్ణంగా ప‌రిశీలించి, అంశాల వారీగా విస్తృతంగా చ‌ద‌వాలి.

• ప్రాథమిక అంశాల‌పై పూర్తి ప‌ట్టు సాధించాలి. దీనికోసం ఇంట‌ర్మీడియ‌ట్‌, యూజీ పాఠ్య‌పుస్త‌కాలు బాగా చ‌ద‌వాలి. ఆ త‌ర్వాత‌ పీజీతో పాటు రిఫ‌రెన్స్‌లు అవ‌స‌రం మేర‌కు అధ్య‌య‌నం చేయాలి.

• పలు అంశాలను జోడించే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు కాబ‌ట్టి స‌బ్జెక్టులో లోతైన ప‌రిజ్ఞానం కావాలి. అందువల్ల సూక్ష్మ స్థాయిలో చదవాలి. పరిమిత పుస్తకాలనే, విస్తృతంగా చదువుతూ, ముఖ్య‌మైన అంశాల‌ను నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటినే ఒక‌సారి మళ్లీ రివిజ‌న్ చేసుకోవాలి.

• ప్రశ్నలు పునరావృతం కాకపోయిన, పరీక్షలో విజయానికి చాలావర‌కు పాత ప్రశ్నపత్రాలే దిక్సూచి. ప్రశ్నల స్థాయి, అడిగే తీరు, అంశాలవారీ ప్రాధాన్య‌త వీటితో తెలుసుకోవచ్చు. దీనిని బ‌ట్టి ఏమి చ‌ద‌వాలి, ఎలా చ‌ద‌వాలో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు.

• అధ్య‌య‌నం చ‌ద‌వ‌డం పూర్త‌యిన త‌ర్వాత క‌నీసం ప‌ది న‌మూనా ప‌రీక్ష‌ల‌ను రాసి, ఫ‌లితాల‌ను విశ్లేషించుకోవాలి. ఏ విభాగాల్లో త‌ప్పులొస్తున్నాయో గుర్తించి, వాటిపై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాలి. ఇందులో నెగిటివ్ మార్క‌లు లేనందున తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌కు బాగా ఆలోచించి జ‌వాబులు గుర్తించాలి.

• ఒక‌వేళ యూజీసీ నెట్ పేప‌ర్లో ఏదైనా ప్ర‌శ్న‌కు ఒక‌టి కంటే ఎక్కువ స‌మాధానాలు ఉన్నా, ప్ర‌శ్న‌లో ఏమైనా పొర‌పాట్లు ఉన్నా బోన‌స్ మార్కులు ఇస్తారు. ఎవ‌ర‌యితే ఆ ప్ర‌శ్న‌కు ఏదో ఒక ఆప్ష‌న్ జ‌వాబుగా గుర్తిస్తారో వారికే ఈ బోన‌స్ మార్కు దక్కుతుంది. ఏ స‌మాధాన‌మూ గుర్తించ‌ని వారికి ఈ మార్కులు క‌ల‌పరు. అందుకే తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌ను వ‌ద‌లకుండా స‌మాధానాలు గుర్తించాలి.


యూజీసీ నెట్‌ పరీక్ష...పేప‌ర్లు

ఈ ప‌రీక్ష‌లో రెండు పేపర్లు 300 మార్కుల‌కి, 150 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున కేటాయించారు. పరీక్షల‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. అభ్య‌ర్ధులంద‌రికీ పేప‌ర్‌-1 ఉమ్మ‌డిగా ఉంటుంది. 50 ప్రశ్నలకు వంద మార్కులు. రెండో పేప‌ర్‌ను వంద ప్ర‌శ్న‌ల‌కు 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఈ ప్రశ్నా పత్రం అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప‌రీక్షా స‌మ‌యం 3 గంట‌లు. పేప‌ర్‌-1 కి, పేప‌ర్‌-2 కి మ‌ధ్య ఎటువంటి విరామ స‌మ‌యం ఉండ‌దు.


పేప‌ర్‌-1: ఈ పేప‌ర్‌-1లో 10 విభాగాలుంటాయి. అవి టీచింగ్ ఆప్టిట్యూడ్‌, రిసెర్ఛ్ ఆప్టిట్యూడ్‌, కాంప్ర‌హెన్ష‌న్‌, క‌మ్యూనికేష‌న్‌, మ్యాథ‌మెటిక‌ల్ రీజ‌నింగ్ అండ్ ఆప్టిట్యూడ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ కమ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (ఐసిటీ), పీపుల్‌, డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్‌, హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ సిస్టం. ఈ విభాగం ప్ర‌శ్న‌లు అభ్య‌ర్ధి బోధ‌న‌, ప‌రిశోధ‌న రంగంలో రాణించ‌గ‌ల‌రా, లేదా తెలుసుకునేలా ఉంటాయి.

ఆలోచన విధానం, ఆంగ్లాన్ని అర్ధం చేసుకునే తీరు, గణితంలో ప్రాథమిక పరి జ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, కమ్యూని కేషన్ సాధనాలు, అభివృద్ధి, పర్యావరణం, ఉన్నత విద్యల్లో ఉన్న ప్రశ్నలు ఇస్తారు.


పేపర్-2: ప్రశ్నలన్నీ అభ్యర్ధి ఎంచుకున్న సబ్జెక్టు నుంచే ఉంటాయి. ఆ సబ్జెక్టు/విభాగంలో.. ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులో పూర్తి నైపుణ్యం ఉంటేనే సమాధానం గుర్తించగలరు. ప్రతి అంశాన్నీ విస్తృతంగా సూక్ష్మ స్థాయిలో చదవాలి.


ఇది చదవండి: NEET 2025--నీట్ ప‌రీక్షా పూర్తి వివ‌రాలు


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD